క్షయ మెనింజైటిస్ అవలోకనం: ప్రమాదాలు, చికిత్సలు మరియు నిర్వహణ
పరిచయం:
క్షయ వ్యాధి అనేది ఒక అత్యంత తీవ్రమైన అంటు రోగం. ఇది బాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు ఒక కోటి మందికి సంక్రమిస్తుంది. చాలా మంది అనుకునే విధంగా క్షయ అనేది కేవలం ఊపిరి తిత్తుల పై మాత్రమే ప్రభావం చూపకుండా ఇది మెనింజైటిస్ ని కూడా కలగ చేస్తుంది. ఈ మెనింజైటిస్ అనేది మెదడు చుట్టూ మరియు వెన్నుపూసలో వాపును కలుగ చేసే ఒక ప్రాణాంతకమైన వ్యాధి. ఈ శీర్షికలో మనము క్షయ మెనింజైటిస్, వాటి కారణాలు, నివారణ, వ్యూహాలు, క్షయ వ్యాధి వల్ల కలిగే పరిణామాలు, చికిత్సా విధానం ఇంకా దానికి సంబంధించిన ఇతర విషయాల గురించి చర్చిద్దాం. ఈ వ్యాధిని తేలికగా తీసుకోకండి!
క్షయ వ్యాధిని మరియు క్షయ మెనింజైటిస్ (tuberculosis meningitis) ని అర్ధం చేసుకోవడం:
క్షయ ఒక బాక్టీరియల్ సంక్రమణ. ఇది మైకో బాక్టీరియమ్ (mycobacterium) క్షయ ద్వారా కలుగుతుంది. అది ప్రధానంగా ఊపిరి తిత్తులను ప్రభావితం చేస్తుంది. కానీ అది ఊపిరి తిత్తులనే కాకుండా శరీరంలోని ఇతర భాగాలు అయిన మెదుడు మరియు వెన్నుపూసకు కూడా సోకవచ్చు. ఈ వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ నోటి ద్వారా వచ్చే బాక్టీరియా కలిగిన తుంపరలు ఈ వ్యాధి ని ఇతరలుకు కలగ చేస్తాయి. ఇంకా క్షయ కలుషితమైన పాలు, నీరు మరియు ఆహారం ద్వారా కూడా వ్యాపించవచ్చు.
క్షయ మెనింజైటిస్!
క్షయలోని బాక్టీరియా మెనింజెస్ (meninges) కు సంక్రమించినప్పుడు క్షయ మెనింజైటిస్ వస్తుంది. ఈ మెనింజెస్ అనేది మన మెదడు చుట్టూ వున్న ఒక రక్షిత కవచం లాంటిది. ఇది వెన్నుపూసలో కూడా ఉంటుంది. క్షయ యొక్క బాక్టీరియా మన నరాల వ్యవస్థ ద్వారా రక్తంలో లేదా లింఫాటిక్ వ్యవస్థలో చేరి ఇతర భాగాలకు కూడా వ్యాపించవచ్చు. కానీ ప్రాథమికంగా ఇది ఊపిరి తిత్తుల పై దాడి చేస్తుంది.
క్షయ వ్యాధి మరియు మెనింజైటిస్ లక్షణాలు:
ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పలేము. కొన్ని ఇతర వ్యాధులకు కూడా ఇటువంటి లక్షణాలు ఉండవచ్చు.
కేవలం క్షయ వ్యాధికి ఉండే లక్షణాలు:
- ఛాతిలో నొప్పి: ఛాతిలో నొప్పి లేదా లోతుగా ఊపిరి పీల్చుకునేటప్పుడు తీవ్ర అసౌకర్యం ఉండడం
- దగ్గినప్పుడు రక్తం పడడం: దగ్గినప్పుడు రక్తం పడడం లేదా రక్తంతో కూడిన కఫం బయటకు రావడం
- దగ్గినప్పుడు కఫం రావడం: దగ్గినప్పుడు మందంగా, అంటుకు పోయే తత్త్వం ఉన్న శ్లేష్మం పడడం
- దగ్గడం: తరచుగా దగ్గడం, రక్తంతో కూడిన శ్లేష్మం పడడం
- అలసట : అలసటగా, శక్తి లేనట్టుగా ఉండడం
- జ్వరం: శరీరంలో ఉష్ణోగ్రత బాగా పెరిగి చలిగా ఉండడం
- ఆకలి లేక పోవడం: మనకి ఆకలి వేయకుండా తినేటప్పుడు ఇబ్బంది కలిగే విధంగా ఉండడం
- రాత్రి చమట పట్టడం: రాత్రి అధికంగా చమట పట్టడం, ముఖ్యంగా రాత్రుళ్ళలో
- ఊపిరి అందక పోవడం: శ్వాస పీల్చుకునేటప్పుడు ఊపిరి సరిగ్గా అందక పోవడం
- బరువు తగ్గడం: అనుకోకుండా బరువు కోల్పోవడం
మెనింజైటిస్ లక్షణాలు (వ్యాధి మెనింజెస్ కు సోకినప్పుడు):
- తల నొప్పి: తీవ్రమైన తల నొప్పి మరియు మెడ పట్టి వేయడం
- అయోమయం: మానసిక స్థితి చాలా గందరగోళంగా, అస్తవ్యస్తంగా ఉండడం
- మూర్చ: మతి భ్రమణ కలగడం, మూర్చ పోవడం
- అపస్మారక స్థితి (కోమా): చాలా అరుదైన సందర్భాలలో క్షయ మెనింజైటిస్ రోగిని అపస్మారక స్థితి లోకి నెట్టి వేస్తుంది. ఇంకా కొన్ని సందర్భాలలో అది మరణానికి కూడా దారి తీయవచ్చు.
పైన చెప్పిన లక్షణాలు అందరిలో ఉండకపోవచ్చు. కొంత మందికి అసలు ఏ లక్షణాలు ఉండకపోవచ్చు. కానీ మీరు గనక ఒక వేళ క్షయ వ్యాధిగ్రస్తుల సన్నిధిలో ఉన్నట్టు అయితే తప్పక వైద్యున్ని సంప్రదించి దానికి సరైన నిర్ధారణ మరియు చికిత్స తీసుకోవాలి.
క్షయ మెనింజైటిస్ యొక్క కారణాలు
క్షయ మెనింజైటిస్ ఒక అరుదైన, క్లిష్టమైన క్షయ సంక్రమణ. ఇది సుమారుగా 1-3% కేసుల్లో ఉంటుంది. ప్రమాదకరమైన క్షయ మెనింజైటిస్ సోకడానికి గల కారణాలు:
1. రోగ నిరోధక శక్తి తగ్గడం:
రోగ నిరోధక శక్తి తగ్గడం మూలంగా మన శరీరం క్షయ బాక్టీరియా తో పోరాడ లేదు. తద్వారా అది క్షయ మెనింజైటిస్ రావడానికి కారణం అవుతుంది. మన శరీరంలో రోగ నిరోధక శక్తిని తగ్గించే కొన్ని ప్రధాన కారణాలు:
- ఎచ్.ఐ.వి / ఎయిడ్స్: మనిషిలో రోగ నిరోధక శక్తిని తగ్గించే వైరస్ ఎచ్.ఐ.వి. ఈ వైరస్ సంక్రమణలతో పోరాడే సిడి4 కణాలను నశింప చేస్తుంది. ఈ ఎచ్.ఐ.వి. సోకిన వారు క్షయ లాంటి తదితర వ్యాధులకు త్వరగా లోను అవుతారు.
- మధుమేహం: రక్తంలో అధిక చక్కెర మోతాదు ఉన్నవారు రోగ నిరోధక శక్తి కోల్పోతారు. తద్వారా వారు వివిధ రోగాలతో పోరాటం చేసే శక్తి లేని వారు అవుతారు.
- క్యాన్సర్: లింఫోమా (lymphoma), లుకేమియా (leukemia) లాంటి కొన్ని రకాల క్యాన్సర్లు రోగ నిరోధక శక్తిని తగ్గించి క్షయ మెనింజైటిస్ రావడానికి కారణం అవుతాయి.
- పోషక ఆహార లోపం: ఆహారంలో అవసరం అయిన పోషకాలు, ఖనిజాలు మరియు విటమిన్లు తగ్గడం వలన రోగ నిరోధక శక్తి లోపిస్తుంది. ఇది కూడా క్షయ లాంటి వ్యాధులు రావడానికి కారణం అవుతుంది.
2. సరైన చికిత్స తీసుకోక పోవడం:
క్షయ వ్యాధికి సరైన చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేసినట్లు అయితే అది క్షయ మెనింజైటిస్ రావడానికి కారణం అవుతుంది. క్షయ మెనింజైటిస్ రాకకు గల కారణాలు:
- క్షయ కు సంపూర్ణమైన చికిత్స తీసుకోక పోవడం: వైద్యులు సూచించిన విధంగా క్షయ వ్యాధికి సంపూర్ణమైన చికిత్స తీసుకోకుండా మధ్యలోనే ఆపి వేసినట్టు అయితే అది మన శరీరంలో ఉండే బ్యాక్టీరియా ను పూర్తిగా నిర్మూలించ లేదు. దానితో మళ్లీ సంక్రమణ వచ్చి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ భాగాలలో మెనింజెస్ కూడా ఉండవచ్చు.
- తగిన మోతాదులో మందులు వాడక పోవడం: ప్రయోజనం లేని నాసిరకమైన మందులు వాడటం ద్వారా ఈ బాక్టీరియా మన శరీరంలో నుంచి నిర్మూలింపబడక పోవడం మూలంగా క్షయ మెనింజైటిస్ వచ్చే ప్రమాదం ఉంది.
3. దయనీయమైన జీవన పరిస్థితులు:
సరైన జీవన పరిస్థితులు లేని కారణంగా క్షయ మెనింజైటిస్ సమాజంలో పెరిగే అవకాశం ఈ క్రింది కారణాల వలన ఉంది:
- అత్యంత జనావాసాల మధ్య జీవించడం: మనుషులు ఎక్కువ మంది చాలా దగ్గర దగ్గరగా జీవించడం వలన ఈ వ్యాధి కారకాలు గాలి ద్వారా క్షయ బాక్టీరియా ని కలగ చేసే అవకాశం అధికంగా ఉంటుంది.
- పారిశుద్ధ్య రాహిత్యం: సరి లేని పారిశుద్ధ్య నిర్వహణ, కలుషితమైన నీరు ఇంకా పరిశుభ్రంగా లేని పరిసరాల వలన క్షయ లాంటి రోగాలు వ్యాప్తి చెందుతాయి.
- సరిపడ గాలి, వెలుతురు లోపించడం: ఇళ్లల్లో ఇంకా బహిరంగ ప్రదేశాలలో చాలినంత గాలి ప్రవాహం లేకపోవడం వలన బాక్టీరియా త్వరగా వ్యాపించడానికి సహకరిస్తుంది.
4. వ్యాధి గల వ్యక్తితో సాన్నిహిత్యం:
అంటువ్యాధి గల వ్యక్తులతో దగ్గరగా ఉండడం, వారితో సమయం ఎక్కువగా గడపడం వలన క్షయ మెనింజైటిస్ త్వరగా వ్యాపిస్తుంది. ఇంకా కింద వివరించిన వివిధ కారణాల వల్ల కూడా వ్యాపిస్తుంది:
- క్షయ వ్యాధి ఉన్న వ్యక్తికి చికిత్స చేయకపోవడం లేదా వేరుగా, ఒంటరిగా ఉంచక పోవడం: ఒకవేళ క్షయ వ్యాధి కలిగిన వ్యక్తికి చికిత్స చేయకుండా, ఒంటరిగా ఉంచకుండా చేసినట్టు అయితే వారి దగ్గు, తుమ్ముల ద్వారా వారు ఇతరులకు వ్యాధిని వ్యాపింప చేసే అవకాశం ఉంటుంది.
- సంక్రమణకు గురి అయిన వ్యక్తితో అతి సమీపంగా ఉండడం: క్షయ వ్యాధి బారిన పడ్డ వ్యక్తితో సాన్నిహిత్యంగా, అతి సమీపంగా ఉండడం, వారితో ఆహార పానీయాలు పంచుకోవడం లేదా వారి వ్యక్తిగత వస్తువులను తాకడం లేదా ఉపయోగించడం ద్వారా ఈ వ్యాధి మరింత త్వరగా వ్యాపిస్తుంది.
క్షయ మెనింజైటిస్ వ్యాధి వల్ల కలిగే పరిణామాలు:
ఒక వేళ క్షయ మెనింజైటిస్ కు చికిత్స చేయించకపోతే దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి:
1. మెదడు దెబ్బ తినటం:
క్షయ మెనింజైటిస్ కి చికిత్స చేయించుకోకపోతే శాశ్వతంగా మెదడు యొక్క కణజాలం దెబ్బ తింటుంది. దీని వల్ల:
- మానసిక సంతులనం లేకపోవడం: జ్ఞాపక శక్తి కోల్పోవడం, అయోమయం, ఏ పని పైన శ్రద్ధ చూపలేకపోవడం, మెదడు తన స్థాయికి తగ్గ పని చేయలేకపోవడం.
- మూర్చలు: మెదడు పాడవడం మరియు మెదడు వాపు వలన మూర్చ రోగం వస్తుంది.
- పక్షవాతం: శాశ్వత పక్షవాతం లేదా బలహీనత మూలాన మెదడు లోని వివిధ భాగాలు చెడిపోతాయి.
మెదడు ఎంతగా చెడిపోయింది అని తెలుసుకోవడానికి సంక్రమణ ఎంత తీవ్రంగా ఉంది, ఎంత కాలంగా ఉంది అనే దాని మీద ఆధార పడి ఉంటుంది. క్షయ మెనింజైటిస్ మన మెదడు గతి తప్పేటట్టు చేస్తుంది. తద్వారా ఆ వ్యక్తి తన రోజువారి కార్యక్రమాలను సరిగ్గా, స్వతంత్రంగా నిర్వహించలేడు.
2. వెన్నుపూస దెబ్బ తినడం:
క్షయ మెనింజైటిస్ వలన వెన్నుపూస కూడా శాశ్వతంగా దెబ్బ తింటుంది. ఆ పక్షంలో ఈ క్రింది ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది:
- పక్షవాతం: శాశ్వత పక్షవాతం లేదా బలహీనత వెన్నుపూసకు హాని కలిగించి మనిషి యొక్క చేతులు, కాళ్లు మరియు పూర్తి శరీర కదలికలను ప్రభావితం చేస్తాయి.
- బలహీనత: బలహీన పడిన కండరాలు శరీరంలోని కదలికలను తగ్గిస్తూ రోజువారి కార్యక్రమాలను నిర్వహించలేని విధంగా చేస్తాయి.
క్షయ మెనింజైటిస్ ద్వారా దెబ్బ తిన్న వెన్నుపూస మనిషి యొక్క జీవన శైలి పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ మనిషి చేసే రోజువారి పనులు చేసుకోవడం కూడా చాలా కష్టతరంగా మారుతుంది. ఆ మనిషి స్వతంత్రంగా జీవించడం, సాంఘిక కార్యక్రమాలలో పాల్గొనడం వంటి వాటి పై క్షయ మెనింజైటిస్ ప్రభావం చూపుతుంది.
3. మరణం:
చికిత్స చేయని క్షయ మెనింజైటిస్ వలన మరణాలు ఎక్కువగా సంభవిస్తాయి. ముఖ్యంగా:
- పిల్లలు: పిల్లలు క్షయ మెనింజైటిస్ కి ఎక్కువగా గురి అవుతూ ఉంటారు. ఎందుకంటే వారి రోగనిరోధక శక్తి అప్పుడప్పుడే పెరుగుతూ ఇంకా పూర్తి స్థాయికి రాలేదు కాబట్టి. 15 సంవత్సరాల లోపు గల పిల్లలు మృత్యువాత 20 నుండి 30 మధ్యలో ఉంటుంది.
- బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న మనుషులు: కీమో థెరపీ (chemotherapy) చేయించుకున్న క్యాన్సర్ రోగులలో మరియు ఎచ్.ఐ.వి ఎయిడ్స్ ఉన్న రోగులలో ఈ రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. వీరు క్షయ మెనింజైటిస్ కి ఎక్కువగా గురి అవుతూ ఉంటారు.
- వృద్ధులు: క్షయ మెనింజైటిస్ వయసు పై బడిన వృద్ధులలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న కారణంగా త్వరగా వృద్ధి చెందుతుంది.
క్షయ మెనింజైటిస్ వలన మరణాలు ఈ క్రింది కారణాల వల్ల సంభవిస్తాయి: - మెదడు ఎడెమా: మెదడు లోని వాపు వలన లోపల ఉండే కపాలము తీవ్ర ఒత్తిడికి గురి అవుతుంది.
- మెనింజైటిస్ వలన కలిగే షాక్: సంక్రమణ వలన కలిగే సెప్సిస్ లేదా సెప్టిక్ షాక్.
- శ్వాసకోశ విఫలం: ద్వితీయ బాక్టీరియా సంక్రమణల వలన న్యూమోనియా (pneumonia) లేదా శ్వాసకోశాలు విఫలం అవుతాయి.
ప్రారంభంలోనే సరైన నిర్ధారణ మరియు చికిత్స అవసరం. తద్వారా సంక్లిష్ట పరిస్థితులను, మరణాలను తగ్గించవచ్చు.
నివారణ వ్యూహాలు:
క్షయ మెనింజైటిస్ నివారణకు ముందుగా క్షయ సంక్రమణను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. వ్యాధి వచ్చిన తరువాత చేసే చికిత్స కంటే వ్యాధిని ఎలా నివారించాలో తెలుసుకోవడం మంచిది.
- సరైన పరీక్షల ద్వారా క్షయ వ్యాధి ఉన్నదో లేదో నిర్ధారణ చేసుకోవడం: మీరు క్షయ వ్యాధికి లోనైనట్టు అనిపించినా, ఆ వ్యాధి లక్షణాలు మీలో కనిపించినా పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి.
- పరిశుభ్రతను పాటించడం: మీరు దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కాని నోటిని మరియు ముక్కుని చేతితో కప్పడం చేయాలి.
- మాస్కులు ధరించడం: జనావాసాల్లో తిరిగినప్పుడు అవగాహన కలిగి సంక్రమణ వ్యాపించకుండా ఉండడానికి మాస్కు ధరించాలి.
- గాలి వెలుతురు ఉండేటట్టు చూసుకోవడం: ఇళ్లల్లో గాని జనాల మధ్య గాని ఉన్నప్పుడు సరైన గాలి మరియు వెలుతురు ఎల్లప్పుడూ ఉండేటట్టు చూసుకోవాలి.
- సంపూర్ణమైన చికిత్స పొందడం: ఒక వేళ క్షయ వ్యాధి ఉన్నట్టు నిర్ధారించబడితే వైద్యులు సూచించిన విధంగా తగిన మందులు వాడాలి.
చికిత్సా విధానాలు:
వేగవంతమైన నిర్ధారణ మరియు చికిత్స క్షయ మెనింజైటిస్ వ్యాధిని నియంత్రించడంలో తోడ్పడుతుంది. సాధారణ చికిత్స ఈ కింది విధానాలుగా ఉంటుంది:
- యాంటీ బయాటిక్స్: వివిధ రకాల యాంటీ బయాటిక్ ల కలయికతో కూడిన మందులు ఈ క్షయ మరియు మెనింజైటిస్ కు వాడతారు.
- ఆసుపత్రిలో చేరడం: రోగులు క్షయ మరియు మెనింజైటిస్ వచ్చినప్పుడు ఆసుపత్రిలో చేరి ఆ లక్షణాలను గమనించుకుంటూ చికిత్స తీసుకోవడం అవసరం.
- సహాయక చర్యలు: నొప్పిని అదుపులో ఉంచుకుంటూ, శరీరంలోని తేమను కాపాడుకుంటూ సరైన పోషణలు కల ఆహారాన్ని తీసుకోవడం అవసరం.
ముగింపు:
క్షయ మెనింజైటిస్ ఒక ప్రమాదకరమైన మరియు సంక్లిష్టమైన క్షయ సంక్రమణ. దీనికి సరైన నిర్ధారణ మరియు చికిత్స తీసుకోవడం అవసరం. లేకపోతే ముందు ముందు ఇది మన ఆరోగ్యాన్ని నశింప చేసి మరణానికి కూడా దారి తీయవచ్చు. ఈ వ్యాధి రాకపై పూర్తి అవగాహన కలిగి దాన్ని నివారించడానికి గల కారణాలను తెలుసుకొని ఈ వ్యాధిని అరికట్టాలి. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి యొక్క ప్రభావాన్ని తగ్గించిన వారు అవుతాం.
తరచుగా అడిగే ప్రశ్నలు
1.సాధారణమైన జలుబుకి క్షయ వ్యాధికి గల తేడా ఎలా కనిపెట్టగలము?
క్షయ వ్యాధి మరియు సాధారణమైన జలుబు ఇంచుమించు ఒకే పోలికతో ఉంటాయి. కానీ క్షయకు గురైనప్పుడు తరచుగా దగ్గు రావడం, బరువు కోల్పోవడం మరియు అలసిపోవడం వంటి లక్షణాలు అదనంగా ఉంటాయి. కావున వెంటనే వైద్యున్ని సంప్రదించి వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి.
2.క్షయ వ్యాధి నయం అవుతుందా?
సరైన చికిత్స పొందడం ద్వారా క్షయ వ్యాధిని నయం చేసుకోవచ్చు. చికిత్సా విధానంలో 6 నుండి 12 నెలల పాటు వైద్యులు సూచించిన విధంగా యాంటీ బయాటిక్స్ తీసుకుంటూ ఉంటే సంక్రమణ పూర్తిగా నిర్ములింప పడుతుంది.
3.క్షయ వ్యాధి నివారణకు ఉపకరించే ఆహారాలు ఏమిటి?
రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి విటమిన్ ఏ, డి, ఈ మరియు కె గల సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. దీనివలన క్షయ వ్యాధి నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. పుష్కలంగా ఆకు కూరలు, విత్తనాలు, గింజలు మరియు ఫ్యాటీ ఫిష్ ను మన ఆహారంలో చేర్చాలి.