చిగుళ్లతో పోరాడటం: కీలక ఎంపికలు మరియు ప్రభావవంతమైన నివారణలు
పరిచయం :
చిగుళ్ళు, సాధారణంగా కంటికి కనిపించవు కానీ, అవి ప్రకాశవంతమైన మరియు ఆకర్షణీయమైన చిరునవ్వు యొక్క రహస్యం. ఈ అందమైన చిరునవ్వుకి మూలమైన అసలైన కథానాయకులు.తెర వెనుక అవిశ్రాంతంగా పని చేస్తాయి, మన దంతాలకు ఊతంగా నిలబడి మన ముఖ నిర్మాణాన్ని పొందికగా రూపొందిస్తాయి. ఒక సొంపైన చిత్రానికి సున్నితమైన కాన్వాస్ లా, చిగుళ్ళు మన ముత్యాల్లాంటి మెరిసే పళ్లకు మంచి పునాదిని అందిస్తాయి, వాటిని సున్నితంగా ఇంకా ధృడంగా పట్టుకుని ఉంటాయి.
ఇంగ్లీష్ లో గమ్స్ లేదా గింగివా అని కూడా పిలువబడే చిగుళ్ళు మన నోటి ఆరోగ్యంలో కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ఈ బ్లాగ్‌లో గింగివైటిస్ అని పిలువబడే చిగుళ్ల వాపు, దాని కారణాలు, పరిణామాలు, వైద్య చికిత్సలు మరియు మరింత ఉపయోగకరమైన సమాచారం గురించి మరింత తెలుసుకుందాం.
చిగుళ్ల వాపు లేదా గింగివైటిస్ :
ఇన్ఫెక్షన్ లేదా చికాకు కారణంగా చిగుళ్ళు ఎర్రబడినప్పుడు మరియు వాపుగా మారినప్పుడు చిగుళ్ళు వాపు ఏర్పడతాయి. ఇన్ఫెక్షన్ సాధారణంగా దంతాలు మరియు చిగుళ్ళపై ఏర్పడే బ్యాక్టీరియా యొక్క పలుచని జిగురుతో కూడిన పొర ఏర్పడటం వల్ల వస్తుంది. పళ్ళను బ్రష్ తో శుభ్రం చేయడం మరియు ఫ్లాసింగ్ ద్వారా ఆ జిగురు పొరని ఎప్పటికప్పుడు తొలగించకుండా అశ్రద్ధ చేస్తే, అది టార్టార్‌గా గట్టిపడుతుంది, ఇది చిగుళ్ల వ్యాధికి దారితీస్తుంది.
నోటి ఆరోగ్యంలో చిగుళ్ళ పాత్ర మరియు వాటి ప్రత్యేకత ఏమిటి?
నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చిగుళ్ళు కీలక పాత్ర పోషిస్తాయి. అవి :
- దంతాలకు హానికరమైన బ్యాక్టీరియా మరియు ఇతర పరాన్న పదార్ధాలకు మధ్య అడ్డుగోడగా నిలుస్తాయి .
- దంతాలకు ఊతంగా నిలిచి పటిష్టంగా ఉండేలా చేస్తాయి
- పళ్లు కొరకడాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి
- దంతాలు మరియు చుట్టుపక్కల కణజాలాలకు రక్త ప్రవాహాన్ని క్రమబద్ధీకరిస్తాయి
- దంతాలు ఊడిపోవడాన్ని నివారించడానికి సహాయం చేస్తాయి.
చిగుళ్ళ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, వీటిలో నరాల చివరి భాగాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎక్కువ స్పర్శ మరియు ఒత్తిడికి తట్టుకోలేనంత సున్నితంగా ఉంటాయి. ఈ సున్నితత్వం చిగుళ్ళు ఎర్రబడినప్పుడు లేదా ఇన్ఫెక్షన్‌కు గురైనప్పుడు అసౌకర్యంగా మరియు బాధాకరంగా కూడా ఉంటుంది.
చిగుళ్ళ వాపుకు కారణాలు :
చిగుళ్ళ వాపు వివిధ రకాల కారణాల వల్ల సంభవించవచ్చు, వాటిలో :
1.పేలవమైన నోటి పరిశుభ్రత : ఎవరైనా క్రమం తప్పకుండా పళ్ళను బ్రష్ తో శుభ్రం చేయడం మరియు ఫ్లాస్ చేయడంలో విఫలమైనప్పుడు, వారి దంతాలు మరియు చిగుళ్లపై గార ఇంకా టార్టార్ ఏర్పడి, చిగుళ్లు ఎర్రబడటం మరియు వాపుకు దారితీస్తుంది.
2.జన్యుశాస్త్రం : కొంతమంది వారి జన్యుపరమైన నేపథ్యం కారణంగా అంటే వంశ పారంపర్యంగా వచ్చే చిగుళ్ల వ్యాధికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఎవరైనా తల్లిదండ్రులకు లేదా తాతలకు చిగుళ్ల వ్యాధి ఉంటే, వారు కూడా దాని బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.
3.హార్మోన్ల మార్పులు : జీవితం లో కొన్ని దశలలో హార్మోన్ల హెచ్చుతగ్గులు ఎవరినైనా ప్రభావితం చేయడం సర్వసాధారణం. ఉదాహరణకు, గర్భధారణ సమయంలో, ఋతుస్రావం లేదా రుతువిరతి సమయంలో, హార్మోన్ల మార్పులు చిగుళ్ల సున్నితత్వం మరియు వాపుకు కారణమవుతాయి.
4.ధూమపానం : సాధారణ వ్యక్తుల కన్నా ధూమపానం చేసే వ్యక్తులు చిగుళ్ల వాపుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఎవరైనా ధూమపానం చేసినప్పుడు, అది వారి చిగుళ్ళకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది, తద్వారా వారు చిగుళ్ల మంట, వాపు మరియు ఇన్ఫెక్షన్ కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
5.మందులు : కొన్ని సందర్భాలలో మనం తీసుకునే కొన్ని మందులు నోరు పొడిబారడానికి కారణమవుతాయి, పొడిబారిన నోరు మన చిగుళ్ళను చికాకుపెడుతుంది మరియు వాపుకు దారితీస్తుంది. యాంటిడిప్రెసెంట్స్, స్టెరాయిడ్స్ మరియు యాంటిహిస్టామైన్లు వంటి కొన్ని రకాల మందులని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.
6.అనారోగ్యకారమైన ఆహారపు అలవాట్లు : చక్కెర మరియు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారం దంత క్షయం మరియు చిగుళ్ల వ్యాధికి దోహదం చేస్తుంది. ఇటువంటి పదార్ధాలను తిన్నప్పుడు మన నోటిలోని బ్యాక్టీరియా మన చిగుళ్ళు మరియు చుట్టుపక్కల కణజాలాలను దెబ్బతీసే యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది మంట మరియు వాపుకు దారితీస్తుంది.
చిగుళ్ళ వాపు యెక్క పరిణామాలు :
చికిత్స చేయకుండా వదిలేస్తే, చిగుళ్ళ వాపు మన ఊహకు మించిన తీవ్రమైన పరిణామాలకు దారి తీయవచ్చు :
1.వ్యాధి తీవ్రత :
ఎవరైనా చిగుళ్ల వ్యాధితో బాధపడుతున్నప్పుడు, చిగుళ్లలో ఉన్న బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నోటిలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది, చుట్టుపక్కల ఉండే కణజాలం, ఎముకలు మరియు రక్తప్రవాహంలోకి కూడా చేరుతుంది . ఇదిమరింత తీవ్రమైన పెరియోడొంటైటిస్ వంటి చిగుళ్ల వ్యాధిగా రూపాంతరం చెందుతుంది, ఇది వాపు, నొప్పి మరియు పళ్లు ఊడిపోవడం వంటి తీవ్రమైన నష్టాలను కూడా కలిగిస్తుంది. తో శుభ్రం చేయడం మరియు ఫ్లాసింగ్ ద్వారా ఆ జిగురు పొరని ఎప్పటికప్పుడు తొలగించకుండా అశ్రద్ధ చేస్తే, అది టార్టార్‌గా గట్టిపడుతుంది, ఇది చిగుళ్ల వ్యాధికి దారితీస్తుంది.
2.పళ్లు ఊడిపోవడం :
చిగుళ్ల వ్యాధి ముదిరితే దవడ ఎముక మరియు చిగుళ్లు నాశనం అయ్యే పరిస్థితులకు దారి తీస్తుంది, దీని వలన దంతాలు వదులుగా అయ్యి చివరికి రాలిపోతాయి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ దంతాల సహాయక నిర్మాణాలను బలహీనపరుస్తుంది,దీనివలన దంతాలు అస్థిరంగా మారడం లేదా ఊడిపోవడానికీ ఎక్కువగా అవకాశం ఉంటుంది. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో, దంతాలు పూర్తిగా ఊడిపోయే పరిస్థితి వస్తుంది దీనివలన ఆత్మన్యూనతా భావం ఏర్పడి అందరిముందు సాధారణంగా తినడం, మాట్లాడటం మరియు నవ్వే సామర్ధ్యం ప్రభావితం అవుతుంది.
3.గుండె వ్యాధి :
ఇటీవలి అధ్యయనాలలో చిగుళ్ల వ్యాధి మరియు గుండె జబ్బుల ప్రమాదానికి మధ్య సంబంధం ఉందని కనుగొన్నారు అంతే కాదు ఇది ఇతర గుండె సంబంధిత సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం ఎక్కువగా ఉంది అని కూడా సూచిస్తున్నారు. చిగుళ్ల వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా చిగుళ్లలో జరిగే రక్తస్రావం ద్వారా రక్తప్రవాహంలోకి ప్రవేశించి గుండెతో సహా శరీరంలోని ఇతర భాగాలకు చేరుకుంటుంది. ఇది అథెరోస్క్లెరోసిస్ (ధమనులలో గార ఏర్పడటం) మరియు గుండెపోటు లేదా స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యలు మరింత జటిలం అయ్యే ప్రమాదాన్ని పెంచుతుంది. చిగుళ్ల వ్యాధి వల్ల కలిగే వాపు, మంట కూడా ఈ ప్రమాదాన్ని మరింత పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అధ్యయనాలు సూచిస్తున్నాయి .
4.శ్వాసకోశ సమస్యలు :
ఎవరైనా చిగుళ్ల వ్యాధితో బాధపడుతున్నప్పుడు, వారు దగ్గినా, తుమ్మినా నోటిలో ఉండే బ్యాక్టీరియా అక్కడినుండి ఊపిరితిత్తులలోకి వివిధ మార్గాల ద్వారా ప్రవేశిస్తుంది. ఇది న్యుమోనియా, బ్రోన్కైటిస్ మరియు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (COPD)తో సహా వివిధ శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు, ఊపిరితిత్తులలోకి చేరిన ఈ బ్యాక్టీరియా అతి ఉత్తేజకరమైన రోగనిరోధక ప్రతిస్పందనను కూడా ప్రేరేపిస్తుంది, ఈ ప్రతిస్పందన వాపు, మంట మరియు మరిన్ని ఇతర శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది.
5.తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం :
చిగుళ్ల వ్యాధి ఉన్న గర్భిణీ స్త్రీలు తక్కువ బరువుతో బిడ్డకు జన్మనిచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలలో తెలియపర్చడం జరిగింది . నోటిలోని బాక్టీరియా రక్తప్రవాహంలోకి ప్రవేశించి,తద్వారా మాయ(ప్లాసెంటా)లోకి వెళ్లి చేరుతుంది, గర్భంలో ఉన్న బిడ్డకు పోషకాలు మరియు రక్త ప్రసరణ అందించే ఈ మాయలోకి బాక్టీరియా చేరడం వలన పిండం అభివృద్ధి ప్రభావితం అవుతుంది దీనివలన తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం లేదా ముందస్తు ప్రసవానికి దారితీస్తుంది. అదనంగా, చిగుళ్ల వ్యాధి వల్ల కలిగే వాపు ప్రీఎక్లాంప్సియా మరియు ఇతర గర్భధారణ సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.
చిగుళ్ళ వాపుకు వైద్య చికిత్సలు :
మీరు చిగుళ్ళ వాపు సమస్యను ఎదుర్కొంటుంటే, సరైన రోగ నిర్ధారణ మరియు చికిత్స కోసం మీ దంతవైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. అతను ఇవి సూచించవచ్చు…
- యాంటీబయాటిక్స్ : బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడానికి
- డిబ్రైడ్మెంట్ : ప్రభావిత ప్రాంతం నుండి చనిపోయిన కణజాలాన్ని తొలగించే ప్రక్రియ
- స్కేలింగ్ మరియు రూట్ ప్లేనింగ్ : చిగుళ్ల వరుస క్రింద నుండి గార మరియు టార్టార్‌ను తొలగించే లోతైన శుభ్రపరిచే విధానం
- చిగుళ్ల శస్త్రచికిత్స : తీవ్రమైన సందర్భాల్లో, దెబ్బతిన్న కణజాలాన్ని సరిచేయడానికి శస్త్రచికిత్స అవసరం కావచ్చు
చిగుళ్ళ వాపుకు ఇంటి చిట్కా నివారణలు :
వైద్య చికిత్సలతో పాటు, చిగుళ్ల వాపు ఉపశమనానికి మరియు చికిత్స చేయడానికి సహాయపడే అనేక ఇంటి చిట్కా నివారణలు ఉన్నాయి :
- ఉప్పునీటితో శుభ్రం చేయడం : గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి రోజులో ఎక్కువ సార్లు బాగా పుక్కిలించండి.ఉప్పు నీరు నోటిలోని బ్యాక్టీరియాను నాశనం చేయడానికి సహాయపడుతుంది, చిగుళ్ల వాపును తగ్గిస్తుంది.
- హైడ్రోజన్ పెరాక్సైడ్ తో శుభ్రం చేయడం : హైడ్రోజన్ పెరాక్సైడ్ మరియు నీటిని సమాన భాగాలలో తీసుకుని కలపండి ఈ మిశ్రమాన్ని నోటిలో వేసుకుని 30 సెకన్ల పాటు మీ నోటి చుట్టూ తిప్పుతూ బాగా పుక్కిలించిన తర్వాత ఉమ్మివేయండి.
- కలబంద గుజ్జు (అలోవెరా జెల్) : చిగుళ్ల వాపుని తగ్గించడానికి కలబంద గుజ్జు (అలోవెరా జెల్)ను తీసుకుని నేరుగా ప్రభావిత ప్రాంతంలో మర్దన చేయండి.
- కేమోమైల్ టీ : చల్లార్చిన కేమోమైల్ టీ లో ఉండగా చేసిన దూదిని నానబెట్టి, ప్రభావిత ప్రాంతంలో బాగా పట్టించి 10-15 నిమిషాల పాటు ఉంచండి.
- అల్లం నూనె : శుభ్రంగా ఉన్న దూదిని ఉండగా చేసి అల్లం నూనెను నేరుగా ప్రభావిత ప్రాంతానికి అద్దండి.
ఈ ఆహారాలకు దూరంగా ఉండండి :
చిగుళ్ల వాపును నివారించడానికి, దంత క్షయం మరియు చిగుళ్ల వ్యాధికి దోహదపడే ఆహారాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. పరిమితం చేయవలసిన లేదా నివారించవలసిన కొన్ని ఆహారాలు :
- చక్కెర తో చేసిన చిరుతిండ్లు
- రిఫైన్ చేసిన కార్బోహైడ్రేట్లు
- సిట్రస్ పండ్లు వంటి ఆమ్ల ఆహారాలు
- హాట్ డాగ్‌లు మరియు సాసేజ్‌లు వంటి ప్రాసెస్ చేసిన మాంసాలు
- సోయా సాస్ వంటి పులియబెట్టిన ఆహారాలు
ముగింపు :
చిగుళ్ళు వాపు అనేది ఒక సాధారణ పరిస్థితి, దీనిని వైద్యపరమైన జోక్యం మరియు ఇంటి నివారణలతో చికిత్స చేయవచ్చు. చిగుళ్ల వాపుకు కారణాలు, పర్యవసానాలు మరియు సహజ నివారణలను అర్థం చేసుకోవడం ద్వారా, ఈ పరిస్థితి సంభవించకుండా నిరోధించడానికి మీరు చర్యలు తీసుకోవచ్చు. దీనికి మీరు గుర్తుపెట్టుకోవలసిన విషయాలు ఏంటంటే మంచి నోటి పరిశుభ్రత అలవాట్లను పాటించడం, సమతుల్య ఆహారం తీసుకోవడం మరియు చిగుళ్ల వ్యాధికి దోహదపడే ప్రేరేపకాలను నివారించడం. మీరు చిగుళ్ల వాపు సమస్యను సూచించే లక్షణాలను ఎదుర్కొంటుంటే, సరైన రోగ నిర్ధారణ మరియు సత్వర చికిత్స కోసం మీ దంత వైద్యుడిని తప్పకుండా సంప్రదించండి.
తరచుగా అడిగే ప్రశ్నలు :
1)పిల్లలు చిగుళ్ళు వాపు సమస్యకు గురవుతారా ?
అవును, నోటి పరిశుభ్రత, జన్యు సిద్ధత మరియు ఇతర కారణాల వల్ల పిల్లలలో చిగుళ్ళు వాపు సమస్య సంభవించవచ్చు. తల్లిదండ్రులు తమ పిల్లలతో చిన్న వయస్సు నుండే మంచి నోటి పరిశుభ్రత అలవాట్లను ఆచరింపజేయడం చాలా అవసరం.
2)చిగుళ్ళు వాపు వలన దంత క్షయం వస్తుందా?
చిగుళ్ల వాపు బాక్టీరియా వృద్ధి చెందే వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇది దంత క్షయానికి దారి తీస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే గార మరియు టార్టార్ ఏర్పడడం వల్ల పళ్లు పుచ్చడం మరియు ఇతర నోటి ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది.
3)రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం వల్ల చిగుళ్ల వాపు రాకుండా ఉంటుందా?
ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్ తో సుతిమెత్తని పద్దతిలో రోజుకు రెండుసార్లు బ్రష్ చేసి పంటికి పట్టిన గార మరియు టార్టార్‌ను తొలగించడం ద్వారా చిగుళ్ల వాపును నివారించవచ్చు. ఇలా బ్రష్ చేసినా కానీ , ఆరోగ్యకరమైన చిగుళ్ళను నిర్వహించడానికి క్రమం తప్పకుండా దంత పరీక్షలు మరియు సరైన ఫ్లాసింగ్ కూడా చేయడం చాలా కీలకం.
4)చిగుళ్ళు వాపు క్యాన్సర్‌గా మారుతుందా?
చిగుళ్ళ వాపు సాధారణంగా క్యాన్సర్‌కు సూచన కాదు, కానీ అది చిగుళ్ల వ్యాధి, ఇతర శారీరిక సమస్యలు లేదా ఇంకా అంతర్లీనంగా ఉన్న ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. వ్యాధి లక్షణాలను ముందస్తుగా గుర్తించడం మరియు సత్వర చికిత్స అందించడం వలన సమస్య జటిలం కాకుండా నివారించవచ్చు.
5)చిగుళ్ల వాపు దానంతట అదే నయం అవుతుందా?
చిగుళ్ల వాపును గుర్తించి వెంటనే చికిత్స చేస్తే చిగుళ్ల సమస్యలు వాటంతట అవే నయం కావచ్చు. అయినప్పటికీ, సరైన సంరక్షణ లేకపోతే, చిగుళ్ల వ్యాధి యొక్క మరింత తీవ్ర రూపమైన పెరియోడొంటైటిస్ వంటి వ్యాధులు పురోగమించే అవకాశం ఎక్కువగా ఉంటుంది సరైన చిగుళ్ల ఆరోగ్యానికి క్రమం తప్పకుండా దంత పరీక్షలు మరియు సరైన నోటి పరిశుభ్రత అలవాట్లు అవసరం.