పరిచయం
ఎయిర్ బ్లోవర్ గాలి ని బలవంతంగా బయటకు తోసినట్టుగా, దగ్గు అనేది ఊపిరితిత్తుల నుండి గాలిని బలవంతంగా బయటకు పంపడం - చెత్తను తొలగించడం మరియు శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం. దగ్గు శ్వాసనాళాల నుండి చికాకు కలిగించేవి మరియు శ్లేష్మం వంటి స్రావాలను బయటకు పంపుతుంది, ఊపిరితిత్తులని శుభ్రంగా మరియు శ్వాసకు అనుకూలంగా ఉంచుతుంది. అయితే కొన్నిసార్లు దగ్గు పొడిగా మరి కొన్నిసార్లు తడిగా ఎందుకు ఉంటుంది? పొడి మరియు తడి దగ్గుకు సంబంధించిన అనేక ప్రశ్నలకు ఈ బ్లాగ్లో సమాధానాలు లభిస్తాయి!
దగ్గు వలన ప్రయోజనం కూడా ఉండొచ్చు :
దగ్గు యొక్క సారాంశం, అది ఒక రక్షణ యంత్రాంగం, అన్య కణాలు, శ్లేష్మం లేదా చికాకు కలిగించే స్రావాలను శ్వాసకోసం నుండి వదిలించుకోవడానికి శరీరం ప్రేరేపించే ఒక రిఫ్లెక్స్ చర్య. ఇది చీపురు చెత్తను ఊడ్చినట్లుగా శ్వాస మార్గాలను శుభ్రంగా ఉంచడానికి శరీరం యొక్క మార్గం.
దగ్గు ఒక హెచ్చరిక కూడా కావచ్చు :
అయితే, దగ్గు అనేది రెండంచుల పదునైన కత్తి లాంటిది, ఇది ఒక్కోసారి చెడు శకునంగా కూడా మారుతుంది. ముఖ్యంగా ఇది దాని రక్షిత పనితీరును దాటి కొనసాగినప్పుడు, సహాయక రిఫ్లెక్స్ నుండి సమస్యాత్మక లక్షణంగా మారుతుంది. ఎక్కువ కాలం కొనసాగే దగ్గు అంటువ్యాధులు, అలెర్జీలు, ఉబ్బసం లేదా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (chronic obstructive pulmonary disease - COPD) లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి తీవ్రమైన అంతర్లీన ఆరోగ్య సమస్యను సూచిస్తుంది. అటువంటి సందర్భాలలో, దగ్గు ఒక హెచ్చరిక అవుతుంది, శ్రద్ధ మరియు సంరక్షణను కోరుతుంది.
పొడి మరియు తడి దగ్గు మధ్య వ్యత్యాసం :
తరచుగా దగ్గు రెండు ముఖ్యమైన విధాలుగా వర్గీకరించబడుతుంది : పొడి మరియు తడి.
స్వభావం :
పొడి దగ్గు అనేది శ్లేష్మం లేదా కఫం ఉత్పత్తి చేయని దగ్గును సూచిస్తుంది, తరచుగా గొంతులో నస లేదా దురద వంటివి ఉంటాయి. ఎటువంటి స్రావాలు లేని నిరంతర దగ్గు కాబట్టి ఇది పొడి దగ్గు గా వర్గీకరించబడుతుంది.
తడి దగ్గు అనేది దగ్గుతున్నప్పుడు శ్వాసనాళాల నుండి శ్లేష్మం లేదా కఫం బయటపడుతుంది. ఈ రకమైన దగ్గు గిలకలు మోగినట్ట్టు లేదా బుడబుడ మనే శబ్దాన్నిఉత్పత్తి చేస్తుంది దానితో పాటు గురక ఇంకా ఊపిరితిత్తులు పట్టేసినట్టు ఉంటుంది.
కారణాలు :
- పొడి దగ్గు అనేది తరచుగా పొగ, ధూళి వంటి చికాకులు లేదా జలుబు వంటి వైరస్ల వలన ప్రేరేపించబడుతుంది . ఇతర కారకాలైన అలెర్జీలు, ఉబ్బసం లేదా కొన్నిరకాల మందులు వంటివి కూడా పొడి దగ్గుకు దారితీయవచ్చు. అదనంగా, పొడి గాలి లేదా వాయు కాలుష్యం వంటి పర్యావరణ కారకాలు కూడా పొడి దగ్గు లక్షణాలను మరింత ఉధృతం చేస్తాయి.
- తడి దగ్గు ఉంటే, శ్వాసనాళాల్లో శ్లేష్మం లేదా కఫం ఉందని అర్థం. ఇది సాధారణంగా బ్రోన్కైటిస్ లేదా న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్ల వల్ల లేదా దీర్ఘకాలిక బ్రోన్కైటిస్ లేదా సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటివి ఉండటం వల్ల సంభవిస్తుంది, ఇది అధిక శ్లేష్మం ఉత్పత్తికి కారణమవుతుంది. చల్లని లేదా తడిగా ఉన్న వాతావరణానికి బహిర్గతం కావడం వలన తడి దగ్గు యొక్క లక్షణాలు మరింత తీవ్రతరం అవుతాయి.
లక్షణాలు :
- పొడి దగ్గు వలన, గొంతులో నస లేదా దురద వంటి భావన కలుగుతుంది దీని వలన, నిరంతర దగ్గు ఉంటుంది. తడి దగ్గులా కాకుండా, ఇది శ్లేష్మం లేదా కఫం ఉత్పత్తి చేయదు. పొడి దగ్గు వలన గొంతు బొంగురుపోవడం, నొప్పి ఇంకా నిరంతరంగా వచ్చే దగ్గు వలన కలిగే కదలికల కారణంగా ఛాతీలో అసౌకర్యం ఉంటాయి.
- తడి దగ్గు శ్లేష్మం లేదా కఫం ఉత్పత్తి చేస్తుంది. దీనివలన గిలకలు మోగినట్ట్టు లేదా బుడబుడ మనే శబ్దం వస్తుంది మరియు ఊపిరితిత్తులు పట్టేసినట్టు, గురక లేదా శ్వాస ఆడకపోవడం వంటి ఇబ్బందులు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో, తడి దగ్గు వలన బయటపడిన శ్లేష్మం యొక్క రంగు మరియు చిక్కదనం అంతర్లీనంగా ఉన్న శ్వాసకోశ సమస్య తీవ్రతను సూచిస్తుంది.
ప్రమాద స్థాయి :
- పొడి దగ్గు సాధారణంగా ప్రమాదకరమైనది కాదు, అయితే ఇది చాలా కాలం పాటు కొనసాగితే, గొంతును చికాకు పెడుతుంది అంతే కాని ప్రాణాంతకం కాదు. దీర్ఘకాలిక పొడి దగ్గు వలన నిద్రకు ఆటంకం కలుగుతుంది, అలసటగా ఉంటుంది. అంతేకాదు బలవంతంగా వచ్చే దగ్గు పక్కటెముకలు విరగటం వంటి సమస్యలకు కూడా దారితీయవచ్చు.
- తడి దగ్గులు అన్నివేళలా ఆందోళనకరం కాదు కానీ తడి దగ్గుతో పాటు జ్వరం, ఛాతీ నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే, అది వైద్య సహాయం అవసరమయ్యే తీవ్రమైన సమస్యను సూచిస్తుంది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన మరియు సుదీర్ఘమైన తడి దగ్గు డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్అసమతుల్యతలకు దారితీయవచ్చు లేదా కొన్ని సందర్భాలలో తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులు కలిగించవచ్చు.
తీవ్ర పరిణామాలు :
- నిరంతర పొడి దగ్గు గొంతు లో చికాకును కలిగించడమే కాక చికిత్స చేయకుండా వదిలేస్తే, కాలక్రమేణా లారింగైటిస్ (laryngitis) లేదా క్రానిక్ బ్రోన్కైటిస్ (chronic bronchitis) వంటి మరింత తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. నిరంతర పొడి దగ్గు రోగనిరోధకశక్తిని బలహీనపరచడం వలన ద్వితీయశ్రేణి అంటువ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
- తడి దగ్గుకి చికిత్స చేయకుండా వదిలేస్తే, శ్వాసనాళాల్లో న్యుమోనియా మరియు ఇతర ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుంది. దీని వలన అలసట మరియు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడమేకాక, ఇది బ్రోన్కైటిస్ (bronchitis) లేదా అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (respiratory distress syndrome-ARDS)వంటి పరిస్థితులకు దారితీయవచ్చు. దీర్ఘకాలిక తడి దగ్గు వల్ల ఊపిరితిత్తుల పనితీరు తగ్గుతుంది మరియు జీవన నాణ్యత దెబ్బతింటుంది.
చికిత్స ఎంపికలు :
- పొడి దగ్గును తగ్గించడానికి, గొంతు చికాకులను నివారించాలి, హైడ్రేటెడ్గా ఉండాలి, హ్యూమిడిఫైయర్లను ఉపయోగించాలి, ఉప్పు నీటితో పుక్కిలించడం లేదా తేనె తీసుకోవడం వంటివి కూడా చేయవచ్చు. మందుల దుకాణం లో దొరికే లాజెంజెస్ (lozenges) లేదా దగ్గును అణిచివేసే మందులు కూడా ఉపశమనాన్ని అందిస్తాయి. కొన్ని సందర్భాల్లో, పొడి దగ్గు యొక్క లక్షణాలను తగ్గించడానికి కార్టికోస్టెరాయిడ్స్ (corticosteroids) లేదా బ్రోంకోడైలేటర్స్ (bronchodilators)వంటి ప్రిస్క్రిప్షన్ మందులు అవసరం కావచ్చు.
- తడి దగ్గునుండి ఉపశమనం కోసం ఎక్కువగా ద్రవపదార్ధాలు తీసుకోవాలి దీని వల్ల కఫం పలచబడి దగ్గినప్పుడు త్వరగా బయటపడుతుంది. ఇతర ఇంటి చిట్కాలలో ఆవిరిని పీల్చడం, సెలైన్ నేసల్ డ్రాప్స్ (Saline nasal drops) ఉపయోగించడం లేదా హెర్బల్ టీలు వంటి వెచ్చని పానీయాలు తీసుకోవడం వంటివి చేయవచ్చు. దగ్గు తగ్గకపోతే, తదుపరి చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించండి. యాంటీబయాటిక్స్ (antibiotics), ఎక్స్పెక్టరెంట్స్ (expectorants) లేదా మ్యూకోలైటిక్స్ (mucolytics)వంటి ప్రిస్క్రిప్షన్ మందులు అంతర్లీన అంటువ్యాధుల చికిత్సకు లేదా కఫం ఉత్పత్తిని తగ్గించడానికి సూచించబడతాయి. సమస్య తీవ్రతనుబట్టి ఆసుపత్రిలో చేరడం మరియు సహాయక సంరక్షణ అవసరం కావచ్చు.
ముగింపు :
పొడి మరియు తడి దగ్గులలో కనిపించే లక్షణాలు మరియు పరిణామాల యొక్క తీవ్రత వేరుగా ఉన్నా రెండూ సత్వర చికిత్స మరియు సంరక్షణల ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. ఇంటి చిట్కాలతో లేదా వైద్య జోక్యం ద్వారా అయినా, ఈ దగ్గులను వెంటనే పరిష్కరించడం వల్ల అసౌకర్యాన్ని తగ్గించవచ్చు మరియు సమస్యలను నివారించవచ్చు.